విశ్వానికి వెలుగు చూపగలిగినది వేదమే
నేడు విదేశాలలో సయితం అనేకులు ఆత్మవిద్యపట్ల ఆసక్తిచూపుతూ, ఆత్మశోధన కావిస్తున్నారని, ఆట్టి వారందరికి వెలుగు చూపగల శాస్త్రసంపద మనకు పుష్కలంగా వున్నదనీ, దానిని భద్రపఱచుకొంటూ, ఆ వేదశాస్త్రముల యందు నిష్ణాతులైన వారిని సన్మానించుకొంటూ, వారి సంఖ్య పదింతలయ్యేటట్టుకృషి చెయ్యవలసిన బాధ్యత మనందరిపైన కలదు.
ఈరోజుల్లో చాలామంది-మనదేశంలోనేకాదు- విదేశాల్లోకూడా సత్యం ఏది? జన్మకుసార్థక్యం ఏమిటి? జీవితపరమార్థం ఏమిటి? అది ఎంతదూరంలో వుంది? దీన్ని పొందడానికి మనం ఏమి చెయ్యాలి?-అని ఆత్మశోధన చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఈ జన్మలో పూర్తి అయితే మంచిదే లేక కొంతకృషి జరిగినా మంచిదే.
''ఇలా అన్ని చోట్ల ఆత్మవిచారం జరుగుతున్న దానిని బట్టి సత్యానికి విలువ తగ్గలేదని యింకా ఎక్కువ అవుతున్నదని తెలుస్తున్నది.'' అందువల్ల ఆత్మవిద్యయందు కృషిచేసే పండితుల సంఖ్య యింకా ఎక్కువ అయేటట్టు మనమందరం కృషి చెయ్యాలి.
''వేదం వృక్షం, వేదాంతంపుష్పం, అద్వైతం ఫలం.'' ఫలంవుంటెనే అనుభవం, ఉపనిషత్తుల తాత్పర్యాన్ని - అద్వైతానుభవాన్ని అనుగ్రహించినవారు ఆదిశంకరులు.
''ఏసుక్రీస్తూ, గౌతమబుద్ధుడు'' మున్నగువారు కొన్ని బోధలు చేశారు. తర్వాత కొంతకాలానికి కొన్ని సభలవంటివి ఏర్పడి, వాటన్నిటిని సేకరించి, భద్రపఱచి ప్రచారం చేశారు. అయితే ఆదిశంకరులవిషయంలో మనకు ఆ చిక్కులేకపోయింది. వారు స్వయముగా రచించిన మహాగ్రంథాలన్నీ మన భాగ్యవశంచేత మనకు యథాతథంగా లభించినాయి.
''ఆచార్యులవారి ఈగ్రంథాలను అవగాహన చేసుకోడానికి తర్క, వ్యాకరణ, మీమాంసాశాస్త్రాల పరిచయం కావాలి. అందువల్ల ఈ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి మా పరమగురువులు అద్వైతసభను ఏర్పాటు చేశారు. దాని కార్యదర్శి ఒక ట్రస్టును ఏర్పాటుచేసి, యిందుకు అవసరమైన పథకాలను అమలుపరచారు. అందుకు తగ్గమూలధనం కూడా వారు యేర్పాటు చేశారు. దానినుంచే నేడు కొందరు వేదాధ్యయనపరులకు పారితోషికము లివ్వబడు తున్నాయి.
ఆది శంకరులు అనుగ్రహించిన అద్వైత పరమార్థమును విపులీకరించారు. వారి వాక్యములలో ఒక శ్లోకమైనా చదివి, దీనిని అనుసంధానం చేసుకోవడమే వారికి మనం సమర్పించు కోవలసిన కానుక అని చెప్పారు.
పుణ్యశ్లోకులు ఆదిశంకరులు
''ఆదిశంకరులు వేదధర్మాన్ని ఉద్ధరించినపుణ్యశ్లోకులు.'' వారు ఉత్తమ గ్రంథాలు వ్రాయటమేకాక దేశం అంతటా పర్యటించి అందరకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.
''ఆదిశంకరుల తల్లిదండ్రులు సంతానం కోసం తపస్సు చెయ్యగా వారిరువురకు ఈశ్వరు డొక్కసారే స్వప్నంలో హక్షాత్కరించాడు. అల్పాయుష్కుడు, మహామేధావి యైన వాణ్ణిగాని, ఆ యుర్దాయంవక్కటే పూర్ణంగావుండి తదితర గుణాలు వ్యతిరేకంగా వుండేవాణ్ణిగాని - ఎవరు కావాలో కోరుకోమన్నారు. వారు మహాపురుషుణ్ణ కోరారు. శంకరుడు తానే అవతరిస్తున్నట్టు చెప్పాడు.'' ఆ విధంగా అవతరించిన శంకరులకు ఎనిమిది సంవత్సరాల వయస్సువరకే ఆయుర్దాయం వున్నది. తరువాత ఆశ్రమస్వీకారం చెయ్యటంవల్ల మరొక ఎనిమిదేళ్ల ఆయువు లభించింది. పదహారు సంవత్సరాలకు భాష్యాల్ని వ్రాశారు. వేదవ్యాసులు మారువేషంలో ఆచార్యులవారితో తీవ్రచర్చచేశారు, తుదకు మరోపదహారు సంవత్సరాల ఆయువును ప్రసాదించారు, వ్రాసిన భాష్యాలను దేశంలో ప్రచారం చెయ్యమన్నారు ఆవిధంగా ఆచార్యులవారు ముప్పదిరెండు సంవత్సరాల జీవితం వేదధర్మాన్ని, అద్వైతమార్గాన్ని ఉద్ధరించటానికై అంకితం చేశారు.''
''నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం,
దేవీ సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్,''
అని భారతాన్ని పఠించడానికి ముందు పైధ్యానశ్లోకం చదువుతారు. పరమాత్ముడే గురుశిష్యరూపంలో నరనారాయణులుగా అవతరించాడు. వారు బదరికాశ్రమంలో తపస్సు చేశారు. నారాయణుడు పూర్ణాంశంతో అవతరించాడు, నరుడు అంశావతారం, వారిరువురిని ధ్యానించాలి. వాక్స్యరూపిణియైన సరస్వతిని ధ్యానించాలి. అపుడు జయాన్ని పలకాలి. జయం అంటే భారతం. భారతానికీ పేరు ఉన్నది. బ్రహ్మకపాలంలో వేదవ్యాసుడు లక్షశ్లోకములుగల గ్రంథాన్ని వ్రాశాడు. ఈగ్రంథంలో ధర్మపుత్రాదులకు జయం కలిగింది. ధర్మానికి జయం కలిగింది. అందువల్ల జయనామం దీనికి తగి ఉన్నది.
సంస్కృతభాషలో గద్యం తక్కువ. అన్ని శాస్త్రాలను పద్యాలలోనే బోధిస్తారు, వైద్యం, శిల్పం, జ్యోతిషం అన్నీ శ్లోకాలలోనే ఉంటాయి. వాటిని వల్లించడం సులభం. అడవిలో ఉన్నా లైబ్రరీ సహాయం అక్కరలేదు, బీజగణితాదులు గూడ సంస్కృతంలోనే ఉన్నవి, అక్షరాలకు కొన్ని సంఖ్యల సంజ్ఞల సంజ్ఞచేశారు. వీటినే కటవయాది సంఖ్యలు అంటారు.
వేదాలలో వనసలసంఖ్యల్ని కూడా ఈ సంజ్ఞలతో గుర్తిస్తారు. ''వాయువ్యగ్గ్ శ్వేతమాలభేత'' అన్నపుడు-ఆ సంబంధమైన వనసల్ని ''భజాండ'' శబ్దంతో గుర్తిస్తారు. భ-4, జ-8, డ-3, - అనివస్తుంది. ''అంకానాం వామతో గతిః'' -అన్న సూత్రంవల్ల సంస్కృతంలో అంకెలను ఎడమ నుండి కుడికి లెక్కకట్టాలి. ఈ సంఖ్య 384 అని స్పష్టమవుతుంది.
భారత జయశబ్దంకూడా ఇంతే, 'జ' అంటే 8, 'య' అంటే 1. వెనుకనుండి రాగా 18 అని సంఖ్యవస్తుంది. కాగా, భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. యుద్ధదినాలు పద్ధెనిమిది. అక్షౌహిణీలు పద్ధెనిమిది. గీతలో అధ్యాయాలు కూడా పద్ధెనిమిది. ఈ జయశబ్దంలో ఈ అర్థం అంతా గర్భితమై ఉంది. అందువల్ల ''తతో జయ ముదీర యేత్'' అని భారతాన్ని జయశబ్దంతో చెప్పారు. ''ధర్మ క్షేత్రే '' అనే శ్లోకంలో ''సంజయ'' అన్నపుడు 'జయ' శబ్దముకూడా ఈ సూచనను ఇస్తుంది.
ఐతే ఆది శంకరుల ఆవతారం ఏ సంఖ్యసూచిస్తోంది? వారి నామకరణం ఒక విశేషాన్ని సూచిస్తోంది, తిరువాన్కూరు మహారాజా సంగీత కీర్తనలు వ్రాశాడు. స్వాతి తిరునాళ్ ప్రసిద్ధుడే. ఆయన స్వాతినక్షత్రంలో జన్మించాడు, అలాగే మూలతిరునాళ్ కూడా ఉన్నారు. వారిజన్మ నక్షత్రంతో వారు పేరు పెట్టుకొంటారు. ఆ సంప్రదాయం కేరళ##దేశంలో ఉంది. కేరళలోనే జన్మించిన ఆది శంకరుల జన్మతిథి ననుసరించే వారి నామకరణం చేయబడింది. 'శంకర' పదంలో -ర, 2, క 4, శం 5, అనగా రెండవదైన వైశాఖమాసంలో ఐదవదైన పంచమి తిథినాడు జన్మించినట్టు స్పష్టమవుతోంది.
8-8ొ
పీఠంలో ఆయాగురువులు సిద్ధిపొందినపుడు శ్లోకాలు వ్రాసి చదువుతారు. ఆయా సిద్ధపురుషులు పుణ్యశ్లోకులు, వారిని గూర్చి పుణ్యశ్లోకాలు వ్రాస్తారు. అలాంటిది ఆదిశంకరులను గూర్చిన శ్లోకం ఉన్నది.
''ప్రత్యక్షే గురువస్తుత్యాః'' అని కూడా ఉన్నది. ఈ పుణ్యశ్లోకంలో మహేశాంశాజ్ఞామధుర'' అంటూ ''మహామోహధ్వాంతప్రశమనరవి'' ప్రయోగించారు. షణ్మత గురువన్నారు. ఉత్పత్తిలయములు రెండువారే తమంతతామే చేసుకొంటారు. ''ఫలేస్వస్మిన్'' అని ఉండడంచేత ఫలం అంటే పూర్ణఫలం అని అర్థం - అద్వైతరూపమైన ఈశ్వరతత్వం అదివృక్షానికి తుదిగా వచ్చేదిఫలం; చిగురు, మొగ్గ, పువ్వు, కాయ-తుదకు ఫలం, అది మధురరూపంగా ఉంటుంది. చింత, వేపలలోకూడా ఫలంలో కొంత మాధుర్యం వుంటుంది. ఈఫలంశబ్దం-వారి ఆయువును కూడా సూచిస్తోంది. ల 3 - ఫ 2- 32 సంవత్సరాలని అర్థం.
భగవద్గీతలోని మొదటి శ్లోకాన్నిగూర్చి ఒక్క విషయం చెప్తాను. గీతలో మంగళశ్లోకం ఏది? ఆశీస్సు, నమస్ర్కియ, వస్తునిర్దేశం ఇందులో ఏదో ఒకటి ఆరంభంలో ఉండాలి. రఘువంశంలో ''వాగర్థా వివసంపృక్తౌ''అని నమస్క్రియ ఉన్నది, కురుకర్మైవ తస్మాత్త్వం'-తస్మా ద్యుధ్వస్వ భారత-అని శ్రీకృష్ణుడు చెపుతాడు. నష్టోమోహః-అంటూ, కరిష్యే వచనం తన అంటాడు అర్జునుడు, ఆయన ''కురు'' అంటుంటే ఈయన ''కరిష్యే'' అంటుంటాడు. తిలక్ గీతారహస్యంలో గీత అంతా కర్మయోగం అన్నారు. ఆచార్యుల వారు జ్ఞానప్రధానం అని నిరూపించారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అన్నపుడు క్షేత్రం అంటే శరీరం అని అర్థం 13వ అధ్యాయంలో ఈ అర్థం ఉన్నది. ధర్మసస్యాన్ని ఈ శరీరంలో వృద్ధిచెయ్యాలి. ఒక మంచిపని ఆరంభిస్తాం, మరల విఘ్నం వస్తుంది. చాపల్యం వస్తుంది. మనస్సు మారుతుంది. ఈ యుద్ధంలో యుయుత్సువులమై ఉన్నాము అలా వున్న వారెవరు? నేననే మమకారం ''పాండు'' అంటే పరిశుభ్రత, మామకములు పాండవములు అనేవి చిత్తవృత్తి విశేషాలు, ఇవే యుద్ధానికి సిద్ధపడ్డవి. ''కిం అకుర్వత?'' ఏంచేశాడు? ఏదో చేశారు. చెప్పటానికి లేదు.
శరీరం ధర్మక్షేత్రార్హంగా ఉండాలి, 'సంజయ' అన్నపుడు-సన్-జయ-అని గ్రహించాలి. 'సన్' అంటే ఉపనిషత్తులలో ''సదేవసోమ్యేద మగ్ర ఆసీత్ '' అని చెప్పబడిన పరతత్త్వం, సన్ - సత్స్వరూపంగా ఉండి, జయ-జయమును పొందుము అని అర్థం. ఇలా ఉపదేశించారు, వస్తునిర్దేశరూపమైన అర్థం ఇందులో ఉన్నది.
ఇంకొక్క శ్లోకాంశం చెప్తాను.
యావా నర్థ ఉదపానే సర్వత స్సంపృతోదకే |
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ః ||
ఇది గీతలో రెండవ అధ్యాయంలో ఉన్నది. దీని అర్థం విచారణచేసినపుడు ''శంకరివిజయం'' లోని ఆది శంకరుల వర్ణసంస్మృతికి వస్తోంది. అందులో ''వేదే బ్రహ్మనమః'' లని ఆరంభిస్తూ ఆది శంకరుల పాండితీవైభవాన్ని వర్ణించారు. తుదకు సమస్త విద్యాప్రయోజనాలు అద్వైత బ్రహ్మవిద్యానందంలో లీనం పొందాయన్నారు. జలసమృద్ధమైన సరస్సు సన్నిహితమైనపుడు బావియొక్క ప్రయోజనం వేరే లేకుండగా అందులోనే అంతర్లీన మైనట్లు అని అక్కడ ఉపయోగించారు. సరిగా అదే అర్థం పైశ్లోకంలో సాక్షాత్కరిస్తోంది. పూర్వార్థంలో ''యావాన్'' తో 'తావాన్' కలుపుకోవాలి, అలాగే ఉత్తరార్థంలో పై 'యావాన్'ను 'తావాన్'తో కలుపుకోవాలి. విజానతః- అన్నపుడు 'విజ్ఞానే' అని సప్తమ్యర్థం గ్రహించాలి, అఖండ బ్రహ్మజ్ఞానాన్ని తెలుపటం దీని ఆశయం.
కష్టాలు తొలగించుకోవటానికి చాలా శ్రమలు పడుతున్నాం. లౌకిక పరిహారాలు చేస్తున్నారు. ఆస్తికులు వైదిక ప్రయోగాలతో లాభం పొందటానికి యత్నిస్తున్నారు, ఆపదలో నున్నపుడు నాస్తికుడు కూడా రహస్యంగా నైనా ఆస్తిక పరిహారాలకై యత్నిస్తాడు. కాని, ఈశ్వరభక్తి చిత్తశుద్ధితో అలవరచుకొన్న వాడు ఏ పరిహారాలులేకుండానే అన్ని ప్రయోజనాలను పొందుతాడు. పెద్దమానును ఇటుఅటు లాగాలంటే దానికి ఏనుగును కట్టి లాగించాలి. అదే మాను మహాప్రవాహంలో ఒకపుడు తేలికగా కొట్టుకుపోతుంది. అలాగే పరమేశ్వర భక్తి ప్రవాహం మనలో పెల్లుబుకుతూంటే మహాకష్టాలనే ఈ దుంగలు తేలి, వాటంతటవే కొట్టుకుపోతవి.''
|